Sunday, August 2, 2009

గిరిజన కథల్లో సామాజిక వాస్తవికత

ప్రపంచంలోని అన్నిదేశాల్లో ఆదిమ జాతివారు లేక గిరిజనులున్నారు. అట్లాగే మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో గిరిజనులున్నారు. వీరిని 'గిరిజనులని, ఆదిమజాతివారని, ఆదివాసులని, ఆది మానవులని రకరకాలైన పేర్లతో పిలుస్తుంటారు. భారతదేశంలో ఆర్యులు రాకముందే గిరిజనులున్నారని చారిత్రకారులు భావిస్తుంటారు. అటవీ ప్రాంతంలో నాగరికత సమాజానికి దూరంగా నివసిస్తున్న వారిని 'గిరిజనులు ' గా భారత రాజ్యాంగం గుర్తించింది. కాని సామన్య ప్రజాభిప్రాయంలో ఈ భేదాభిప్రాయాలు పోలేకపోయాయి. అడవినే నమ్ముకునే గిరిజనులు, నాగరికతకు దూరంగా నివసించే వీరి సంస్కృతి, జీవనసరళి అత్యంత అమాయకంగా, అత్యంత సహజంగా ఉంటుంది.
గిరిజనులు అనగానే తలలో ఈకలు, మొలలో గజ్జెలు ఉండే విచిత్ర జీవులని నాడు భావించేవారు. ఆధునిక కాలంలో గిరిజనుల్లో అనేక రకాలైన మార్పులు వస్తున్నాయని భావించాలి.
అడవిలో మైదాన ప్రాంతాల వారి ప్రవేశం వల్ల గిరిజనుల జీవితాల్లో ఆటంకాలు మొదలైయ్యాయి. ఆటంకాలు, భయందోళనలు వారి జీవితాల్లో భాగమయ్యాయి. వీటికితోడు తమ ఆచార వ్యవహారాల వల్ల కూడా గిరిజనులు దుర్భర జీవితాల్ని వెళ్ళదీస్తుంటారు.తెలుగు సాహిత్యం ప్రవేశిస్తున్న ప్రవేశపెడుతున్న జీవితాలు ఎన్నెనో. గిరిజన జీవితం అందులో ఒకటి. తెలుగు కథ గిరిజన జీవితాన్ని, సమస్యలతో ముడిపడి ఉన్నా వారి మమతనూ చాటుతూ ఉంది. నేడు ఈ కోణం పూర్వం కంటే కొంత ఎక్కువగానే ఉంది.
తెలుగు సాహిత్యంలో గురజాడ రాసిన 'దిద్దుబాటు ' (1910)తో తెలుగు కథ ప్రారంభమైతే, గిరిజన జీవితం తెలుగు కథగా చింతా దీక్షితులు రాసిన ' సుగాలీ కుటుంబము ' (1921)తో గిరిజన కథ ప్రారంభమైంది. గిరిజన జీవితాన్ని అరాకొరగా చిత్రించటం కాకుండా, గిరిజన జీవితమే ప్రధాన వస్తువుగా తీసుకొని రాసిన కథలు 'సుగాలీ కుటుంబము, చెంచురాణి, జంగుబాయి, అడవిలో వెన్నెల, పెళ్ళికావాలి, రక్తపింజెర, అయిదు రూపాయల కథ, భూమికొరకు, కన్నీటికథ-నీటికథ, హత్య, తుడుం, బురద మొదలైన కథలు వచ్చాయి.
విశేషమైన అంశమేమిటంటే ఈ కథలను రాసిన వారిలో అత్యధికులు గిరిజనేతరులు కావడం. గిరిజనేతరులు గిరిజన జీవితాలను ఏ విధంగా అర్థం చేసుకున్నారో చూడడం నేడు ఎంతైనా అవసరం.చింతా దీక్షితులు రాసిన 'సుగాలీ కుటుంబము ' కథ తెలుగులో వచ్చిన మొట్ట మొదటి కథే కాకుండా మొట్ట మొదటి కరువు కథ కూడా ఇదే. మైదాన ప్రాంతాంలో నివసిస్తూ అడవిమీద ఆధారపడి జీవించే ఒక సుగాలీ కుటుంబ జీవితం ఈ కథలో చిత్రించబడింది.

కథను పరిశీలిస్తే కుటుంబ యాజమాని రూపాల్ నాయక్ , అతని భార్య చంద్రి. కూలీ నాలీ చేసుకొని కుటుంబాన్ని పోషిస్తుంటారు. కరువు వచ్చి కూలి దొరకక సతమతమవుతుంటారు. అడవికి వెళ్ళి ఈత గింజలు ఏరుకొనివచ్చి, వాటి పొట్టుతో గంజి కాచుకొని తాగుతూ కొంత కాలం బతుకుతారు. ఈత గింజలు దొరక్కపోవటం చేత చింత గింజలు ఏరుకొని వచ్చి వాటి పిండితో రొట్టె చేసుకొని కొన్నాళ్ళు తిని బతుకుతారు. చింత గింజలు వ్యాపార వస్తువుగా మారిపోవటంతో వాటిని కొనే డబ్బు లేక చింతచిగురు బూడిద ఉడకించుకొని తిని కొంతకాలం జీవిస్తారు. కొన్నాళ్ళకు చింతచిగురు కూడా దొరకదు. రూపాల్ నాయక్ అడవికి వెళ్ళి దేవదారు ఆకును దొంగతనంగా తీసుకొచ్చాడని, ఫారెస్టు గార్డులు పట్టుకొని కేసుపెడతారు. దాంతో రూపాల్ నాయక్ జైలు పాలౌతాడు. జైలు నుంచి తిరిగి వచ్చే సరికి తన కుటుంబం చెల్లా చెదురైన తీరు ఈ కథలో చూపించాడు.
గోపి భాగ్యలక్ష్మి రాసిన ' జంగుబాయి ' కథ ఆదివాసి జీవిత దర్పణం. గిరిజన స్త్రీలు ఆచార సంప్రదాయ ముసుగులో పడే బాధలనూ, గోండుల జీవిత సంప్రదాయాలు అవి వాళ్ళ జీవితానికే ఆటంకాలుగా తయారైన తీరుతో పాటు స్త్రీలలో కొత్తతరం వాళ్ళు పితృస్వామ్య సంకెళ్ళ నుంచి బయటి పడలనే తపన, అక్కడ రాజ్యమేలుతున్న అస్పృశ్యతలాంటి రుగ్మతలు, షావుకార్ల వడ్డీ లెక్కలతో గోండులు తమ భూములను కోల్పోవడం లాంటి వాస్తావాలను కూడా ఈ కథ చిత్రించింది.
బి.యస్.రాములు రాసిన ' అడవిలో వెన్నెల ' కథలో గోండులు కష్టపడి అడవిని నరికి సేద్యానికి సిద్ధం చేసిన భూమిని ఫారెస్టు అధికారులు లాక్కోవడం, జాతికి నాయకుడు అని నమ్మించి మహరాజ్ గోండులకు మోసం చేసిన తీరు, చివరికి కామ్రేడ్లు ప్రవేశించి గోండులకు అండగా నిలవడం కథలో ప్రధానం.
సాహూ రాసిన ' అయిదు రూపాయల కథ 'లో వడ్డీ వ్యాపారులు గోండుల రక్తాన్ని జలగల్లా ఎలా పీల్చుకుంటున్నారో వివరించాడు. పొగాకు రిక్కిచ్చి తవ్వెడు కందులు తీసుకునేవాడు, చిన్నబెల్లం గడ్డిచ్చి సోలెడు నువ్వులు తీసుకునేవాడు, సోలెడు బియ్యమిచ్చి అడ్డెడు అవిశలు తీసుకునేవాడు అని షావుకార్ల దోపిడిని ఎత్తి చూపాడు. అలాగే 'రక్తపింజెర 'కథలో కాంట్రాక్టర్లు గోండులకు కనీస కూలీ ఇవ్వకుండా ఎలా దోచుకు తింటున్నారో కండ్లకు కట్టినట్టు రాశాడు. పి.చంద్ రాసిన ' హత్య ' కథలో మానభంగానికి గురై హత్య చేయబడిన ఆదివాసి జంగుబాయి కన్నీటికథ. గిరిజనుల పై జరుగుతున్న హత్యలు, ఎవరు చేశారో, ఎందుకు చేస్తున్నారో తెలియని పరిస్థితులను ఈ కథ వివరిస్తుంది.
ఇలా పైన తెల్పిన కథలోని వైవిధ్యాలను పరిశీలించినట్లయితే గిరిజన జీవితాలు సమాజంలో ఎలా ఉన్నాయో మనకూ అర్థమవుతుంది. అడవుల్లో ఉచితంగా లభించే పండ్లు తినకుండా ప్రభుత్వం ఆంక్షాలు విధించడం, దానికి తోడు కరువు సంభవించడం నిజానికి నేడు కూడా ఇలాంటి వాస్తవిక దృశ్యలే కనిపిస్తున్నాయి.స్త్రీ పురుషులు అనే భేదాభిప్రాయాలు ప్రపంచాన్ని శపిస్తున్నాయి. శరీరంలో వచ్చే మార్పులు స్త్రీలను ఎంతటి దీనస్థితికి తెస్తుందో, ఆచార సంప్రదాయాలు అనే ముసుగులో గిరిజనులు నాగరిక ప్రపంచ చైతన్యానికి దూరమైన తీరు ఈకథల్లో కనిపించే వాస్తవిక దృశ్యాలే.
గిరిజన ప్రాంతాల్లో వ్యాపారం అనే పేరుతో గిరిజనేతరులు ప్రవేశించడం క్రమక్రమంగా పెరిగిపోతుంది. గిరిజనేతరులు గిరిజనులతో సంబంధాలు పెంచుకొని చివరికి మోసగించిని తీరు పై కథలు ఆవిష్కరింప చేస్తున్నాయి.నిజానికి ప్రభుత్వాధికారులు, గిరిజనుల శ్రమను దోచుకొని రాజకీయంగా మోసం చేసి, లైంగికంగా వేదనలకు గురి చేస్తుంటారు. పై అంశాలను సామాజికంగా చూసినట్లయితే నేటికి ఇవి అనేక గిరిజన గుడారాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం గిరిజనుల్లో ఉండే అమాయకత్వం నిరక్షరాస్యతతే కారణం. అందువల్ల గిరిజనులు సమాజంలో అందరితో కలసి నడవాలంటే ఈ అంశాలు పట్ల చైతన్యంగా తయారవ్వాలి.
సమాజంలోని వివిధ సమస్యలను కళాత్మకంగా చెప్పడమే సామాజిక వాస్తవికత. అది భౌతికదృష్టి కలిగి ఉంటుంది. సాధారణంగా సామాజిక వాస్తవిక అనేది జీవితాన్ని ప్రతిబింబిచేట్టుగా ఉంటుంది. వాస్తవాలను కళాత్మకంగా చెప్పిన నిరూపణకు అవకాశం కలిగించేటట్లు ఉంటుంది. అవి చదివిన తర్వాత సాఠకుడికి చైతన్యవంతమైన భావాలను కల్గించేటట్లు ఉంటుంది. దీన్నే సామాజిక వాస్తవికతగా విమర్శకులు చెపుతున్నారు. ఇలాంటి సామాజిక వాస్తవికత గిరిజన కథల్లో ఎక్కువగా ఉంటున్నాయి.
అందువల్ల గిరిజనుల పై మరిన్ని కథలు రావాల్సిన అవసరం నేడు ఎంతో ఉంది.ఇప్పటి వరకు గిరిజనులు కథలు రాయకపోవడానికి కారణం వారికి విద్య కూడా అందుబాటులో లేకపోవడం ఒక ప్రధాన కారణం కావచ్చు.
పరిశోధనంగా గిరిజన జీవితాలను సాహిత్యీకరించవలసిన అవసరం ఎంతో ఉంది. అలా సాహిత్యీకరించే వాళ్ళు గిరిజనులే అయితే మరింతగా వాస్తవిక జీవితాలు ప్రతిఫలింపబడతాయి. అంతే కాకుండా నిజమైన విషయాలు, పరిపూర్ణమైన జీవితాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
-జరుపుల రమేష్.


నా చిరునామా:
జరుపుల రమేష్
రీసెర్చ్ స్కాలర్,ఎన్. ఆర్.ఎస్. హాస్టల్, ఎల్- 102,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
గచ్చిబౌలి, హైదరాబాదు -500 046
Ph: 9618 944654
E Mail: ramesh.jarupula@gmail.com


ఈ వ్యాసం విశాలాంద్రంలో 27.07.2009. ప్రచురించడం జరిగింది.

0 comments: